పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలి
- ప్రణాళిక ప్రకారం చదవాలి:జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
- కోనరావుపేట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ తనిఖీ
విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
కోనరావుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. కిచెన్ లో మెనూ చార్ట్ పరిశీలించి.. దానికి అనుగుణంగా భోజన పదార్థాలు సిద్ధం చేస్తుండగా, తనిఖీ చేశారు. కూరగాయలు, బియ్యం, పప్పుల నాణ్యత పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక ప్రణాళిక ప్రకారం అన్ని పాఠ్యాంశాలను చదవడం, రాయడం సాధన చేయాలని పేర్కొన్నారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏదైనా ఉద్యోగం, స్వయం ఉపాధిలో స్థిరపడాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, జీ సీ డీ ఓ పద్మజ తదితరులు ఉన్నారు.