- ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- ఘన స్వాగతం పలికిన స్థానిక కౌన్సిలర్ ఇప్పపూల మమత అజయ్ దంపతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 22వ వార్డుతో పాటు వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీవితాంతం సొంతింటి కోసం ఎదురుచూసిన పేద కుటుంబాలు నేడు తమ సొంతింట్లో దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.లబ్ధిదారుల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం, వారి కుటుంబాల్లో వెల్లివిరుస్తున్న సంతోషం ఇందిరమ్మ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని,వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇళ్లను మంజూరు చేయగా, రెండో విడతలో మరో 2,000 ఇళ్లను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.దీపావళి పండుగతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం కూడా కావడంతో ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తూ, వారి సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.