రైతులతో కలిసి నాలుగు నెలల క్షేత్రస్థాయి అధ్యయనం..మూడపల్లిలో రైతు సదస్సు
- రైతు సదస్సులో భాగంగా అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు రూపొందించిన మోడల్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.
- రైతులకు ఎరువుల వినియోగం,నీటి పొదుపు, నాణ్యమైన సీడ్స్ గుర్తింపు, మృత్తికల ఆరోగ్యం, సేద్యం నూతన పద్ధతులపై అవగాహన కల్పించారు
ఈ నాలుగు నెలల క్షేత్రస్థాయి అధ్యయనానికి ముగింపుగా మూడపల్లి గ్రామంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.
అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడదను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలుగా ఆయిల్‌పామ్, కుసుమ సాగును ప్రోత్సహించాలని సూచించారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సుమారు 200 మంది రైతులకు ఉచితంగా విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, రాజన్న సిరిసిల్ల శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ..నాలుగు నెలలపాటు విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి రైతుల ఆర్థిక,సామాజిక పరిస్థితులతో పాటు వ్యవసాయ విధానాలను అధ్యయనం చేశారని తెలిపారు. రైతుల నుంచి సాగు అనుభవాలను తెలుసుకోవడంతో పాటు,తాము నేర్చుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు వివరించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రైతులు, వ్యవసాయ విద్యార్థుల మధ్య సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి జరిగిందని,భవిష్యత్తులో రైతులకు మరింత ఉపయోగపడే విధంగా ఇలాంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు దోహదపడతాయని డాక్టర్ సాయి కుమార్ వివరించారు.జిల్లెళ్ళ అగ్రికల్చర్ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు నమ్రత,సాయి చందన,శాలెం కుమారిలు మీడియాతో ప్రత్యేకగా మాట్లాడుతూ..రావే ప్రోగ్రాంలో భాగంగా రైతులతో వారికి ఏర్పడిన అనుబంధాన్ని క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించిన తరుణంలో ఏర్పడిన సందర్భాలను సైతం వివరిస్తూ రైతులకు విలువైన సూచనలు సలహాలు ఇస్తూ రైతులకు మరింత దిగుబడి వచ్చే విధంగా కూడా కృషి చేశామనే విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు సైతం మాట్లాడుతూ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థుల సూచన సలహాలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు.