నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం
- అర్హత ఉండి పెన్షన్లు రాని వారు దరఖాస్తు చేసుకోవాలి.. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం.
- గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, ఊటకుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి.
- ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేకుండా నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి
హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో అర్హులైన 642 మంది లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి,హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నూతనంగా చేయూత పింఛన్లు పొందుతున్న 642 మంది లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హత ఉండి ఇంకా ఏడు రకాల పెన్షన్లు పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని గుర్తుచేశారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మహిళా సంఘాలకు స్టీల్ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని వివరించారు.
ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన నిర్ధారణ శిబిరంలో పేర్లు నమోదు చేసుకున్న లబ్ధిదారులకు బ్యాటరీ రిక్షాలు, చేతి కర్రలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, బెల్టులు తదితర సహాయక పరికరాలను వారి ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు నమోదు చేసుకోని వారు ఉంటే ఈ నెల 25, 26 తేదీల్లో హుస్నాబాద్‌లో నిర్వహించే శిబిరానికి హాజరుకావాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు చిన్న గ్రామాలకు రూ.లక్ష, పెద్ద గ్రామాలకు రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. జనవరి 1వ తేదీలోపు ప్రతి గ్రామంలో రెండు కబడ్డీ, రెండు ఖో-ఖో, రెండు వాలీబాల్ కోర్టులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సర్పంచులను ఆదేశించారు. గ్రామీణ యువత ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్‌లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
కరువు నివారణ, భూగర్భ జలాల పెంపునకు జలసిరి కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్స్ నిర్మించాలని కోరారు. వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి గ్రామంలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వ్యయంతో నాలుగు నుంచి ఐదు ఊటకుంటలు నిర్మించాలని తెలిపారు. సీసీ రోడ్ల పక్కన మ్యాజిక్ పిట్స్ (సోక్ పిట్స్) ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. ఊటకుంటల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించే గ్రామాలకు ఇతర అభివృద్ధి నిధులు నిలిపివేస్తామని హెచ్చరించారు.
గత పదేళ్లలో అర్హులైన అనేక కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు అందకపోవడంతో ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాలకు సమానంగా ఇళ్లను కేటాయించి, ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా నిజమైన నిరుపేదలకు, ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యతనిస్తూ ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు.సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా వృత్తి, పని ఏదైనా సరే జీవనోపాధి కోసం పనిచేసే వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుందని వివరించారు.
జీవో నంబర్ 566 ప్రకారం పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుడు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ బదిలీ చేసే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీడీ డీఆర్డీవో, డీపీవో, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మండల, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.