పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
- 107 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు.. రుద్రంగి మండలంలో మొత్తం 2,275 మందికి పెన్షన్లు.
- రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండలంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన 107 మందికి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
రుద్రంగి మండలంలో నేటి వరకు మొత్తం 2,275 మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని తెలిపారు. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. తాజాగా 107 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు నేడు ఆ కల నెరవేరడం భావోద్వేగానికి గురిచేస్తోందన్నారు. గత మూడు రోజులుగా వేములవాడ, చందుర్తి, మేడిపల్లి ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు లబ్ధిదారుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయని చెప్పారు. ముఖ్యంగా అనారోగ్యం, దివ్యాంగత్వం కారణంగా ఇబ్బందులు పడుతూ పెన్షన్ కోసం ఎదురుచూసిన వారికి ఆర్థిక భరోసా కల్పించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రజల కన్నీళ్లు తుడిచి వారి జీవితాల్లో ఆనందం నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, పేదలకు వైద్య సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
గతంలో కరెంటు బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేసే పరిస్థితులు ఉండేవని, నేడు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తోందన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
*ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం*
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, రుద్రంగి మండలానికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు కూడా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ప్రతిపాదనలు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు.
*దేశానికి తెలంగాణ సంక్షేమ పథకాలు ఆదర్శం*
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆది శ్రీనివాస్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల సాయం వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని చెప్పారు. బీసీ కులగణన ద్వారా రాష్ట్రంలో బీసీల జనాభా 56.37 శాతంగా వెల్లడైందని, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని వివరించారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
రేపు సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ కానుందని తెలిపారు.
*గరీబోళ్లకు అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం*
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల సంక్షేమం కోసం గరీబీ హఠావో నినాదంతో అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆది శ్రీనివాస్ గుర్తుచేశారు. బ్యాంకుల జాతీయీకరణ, పేదల అభ్యున్నతికి చేపట్టిన పలు కార్యక్రమాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా నేడు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోందన్నారు.
పేదల కష్టాలను అర్థం చేసుకొని, వారి జీవితాల్లో వెలుగులు నింపే సంక్షేమ పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.