- రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
- ఆర్టీసీ బస్సు-కారు ఢీ..పలువురికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు చంద్రంపేట చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోనరావుపేట వెళ్లే రహదారిపై సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TS 02 Z 0202) కారు బలంగా ఢీకొన్నాయి. ఉదయం వేళ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. రెండు వాహనాలు వేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు ముందు టైరు పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగం సైతం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో కారులోంచి బయటకు పడి అపస్మారక స్థితికి చేరుకోగా, డ్రైవర్ సీట్లోనే ఇరుక్కుపోయాడు.కిరణ్ సురేష్ ఫోటోగ్రాఫర్స్ మారూపక వివాహ వేడుకల్లో ఫోటోలు ప్రోగ్రాం చేసి వస్తుండగా జరిగిన ఘటన.సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను 108 సిబ్బంది స్థానికుల సాయంతో గడ్డపారతో కారు భాగాలను తొలగించి అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు క్షతగాత్రులను తక్షణమే 108 అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాటిపల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఉండగా, అందరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో ప్రమాదం జరగడంతో బస్సులోని మహిళా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వేకువ జామున పొగమంచు తీవ్రత నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వాహనదారులకు రాజన్న సిరిసిల్ల పోలీసులు కోరుతున్నారు.