విలీన గ్రామాలకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలి
- లేదంటే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ నుంచి తొలగించాలి: వ్యవసాయ కార్మిక సంఘం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి వర్తింపజేసి పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు.నాంపల్లి, తిప్పాపురం, కోనాయిపల్లి, శాత్రాజ్‌పల్లి, అయ్యోర్‌పల్లి తదితర విలీన గ్రామాలతో పాటు పట్టణంలోని నిరుద్యోగ యువత, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక జీవో ద్వారా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయించాలని విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో విలీన గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించి తిరిగి గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గన్నారం నరసయ్య, కార్యదర్శి గురిజాల శ్రీధర్, ఉపాధ్యక్షుడు కుడుకల గిరిబాబు, రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్,దేవేంద్ర,గంగవ్వ,రాధ,కరుణ,మమత,ప్రమీల, ఎల్లవ్వ,తదితరులు పాల్గొన్నారు.