నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు
- మంజూరు పత్రం అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఓ నిరుపేద మహిళకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేసి.. ఆదుకున్నారు.చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అమృత బతుకుదెరువు నిమిత్తం దాదాపు 20 ఏండ్ల క్రితం నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. నాలుగు ఏండ్ల క్రితం తన కొడుకు అనారోగ్య సమస్య పరిష్కారానికి వేములవాడకు వచ్చారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో కిరాయి కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆమె ఇబ్బందులను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే ఆమె వివరాలను అధికారులతో ఆరా తీశారు. ఆమె ఇబ్బందులను తెలుసుకొని చలించిన జిల్లా కలెక్టర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం రాత్రి అనృతకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ప్రత్యేకంగా అందజేశారు.వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో 60 గజాల స్థలం ఉండగా, అక్కడ ఇల్లు నిర్మించుకుంటానని అమృత చెప్పారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో ఇంచార్జి హౌసింగ్ పీడీ సాజిద్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తదితరులు ఉన్నారు.