బహుజన సేన ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలేకు ఘన నివాళి
- వేములవాడ పట్టణంలో జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి – జింక శ్రీధర్
మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ డివిజన్ కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చేసిన సామాజిక సేవలు, విద్యా ఉద్యమాలు, సమానత్వ పోరాటాలను నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జింక శ్రీధర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశంలో కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు. అణగారిన వర్గాలకు విద్యను అందించడమే సమాజ అభివృద్ధికి ప్రధాన మార్గమని నమ్మి, తన జీవితాన్ని సామాజిక మార్పు కోసం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.
మహాత్మ జ్యోతిబా పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్య కోసం పాఠశాలలను స్థాపించి, మహిళా విద్యకు పునాదులు వేశారని గుర్తుచేశారు. సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనం, అసమానతలను ప్రశ్నిస్తూ బహుజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం ఉద్యమించారని తెలిపారు. పూలే దంపతుల పోరాట ఫలితంగానే నేడు అణగారిన వర్గాలు విద్య, సామాజిక రంగాల్లో ముందుకు సాగేందుకు మార్గం సుగమమైందన్నారు.
నేటి యువత మహాత్మ జ్యోతిబా పూలే పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక సమానత్వం, సోదరభావం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల జయంతులు, వర్ధంతులు కేవలం పూలమాలలకే పరిమితం కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా వేములవాడ పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలు లేకపోవడంతో వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వేములవాడ పట్టణంలో అనువైన స్థలాన్ని కేటాయించి పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని బహుజన సేన పక్షాన డిమాండ్ చేశారు. భావితరాలకు వారి ఆశయాలు, త్యాగాలు స్ఫూర్తినిచ్చేలా విగ్రహాల ఏర్పాటు ఎంతో అవసరమని అన్నారు.
ఈ సందర్భంగా యువ చైతన్య దీపం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శేఖర్ సేనాపతి మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు చేసిన విద్యా ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు, శూద్రులు, అణగారిన వర్గాలకు విద్య అందించేందుకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొని పోరాడారని తెలిపారు. విద్య ద్వారానే మనిషికి ఆత్మగౌరవం, ప్రశ్నించే తత్వం, హక్కులపై అవగాహన కలుగుతాయని పూలే దంపతులు సమాజానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, కుల వివక్షకు తావులేని సమానత్వ సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడలో పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరెల్లి నారాయణ, గుడిసె మనోజ్ కుమార్, గుడిసె ప్రసాద్, షేక్ ఫైజాన్, నేదురి చంద్రయ్య, చంద్రగిరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.