Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత పౌరులదే: చెన్నమనేని వికాస్ రావు

Author
Posted By VEMULAWADA VAARTHA
| 01 Nov 2026, 06:21 PM | TELANGANA
ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత పౌరులదే: చెన్నమనేని వికాస్ రావు

  • ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారుతుంటాయి..దేశం, ప్రజాస్వామ్య వ్యవస్థలు శాశ్వతంగా నిలవాలి

రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్ రావు అన్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారడం సహజమని, అయితే భారతదేశం, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థలు శాశ్వతంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.ఆదివారం వేములవాడ పట్టణంలోని మహాదేవ ఫంక్షన్ హాల్‌లో వేములవాడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పౌరులు, మేధావులతో నిర్వహించిన ‘డైలాగ్ విత్ ఎమినెంట్ సిటిజన్స్’ (Dialogue with Eminent Citizens) సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో పౌరుల పాత్ర, సమకాలీన రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రాచీన కాలం నుంచే ప్రజాస్వామ్య సంప్రదాయాలు

ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత పౌరులదే: చెన్నమనేని వికాస్ రావు - Additional Image

భారతదేశానికి ప్రజాస్వామ్య సంప్రదాయం కొత్తదేమీ కాదని వికాస్ రావు అన్నారు. ప్రాచీన కాలం నుంచే ప్రజలు చర్చించి, సమష్టిగా నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం మన దేశంలో ఉందని పేర్కొన్నారు. రుగ్వేద కాలంలో ‘సభ’, ‘సమితి’ వంటి వ్యవస్థలు ప్రజల అభిప్రాయాలను చర్చించడానికి, ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి వేదికలుగా ఉండేవని గుర్తుచేశారు. అనంతరం గ్రామ పంచాయతీలు, బుద్ధుని కాలంలోని గ్రామ సంఘాల ద్వారా ఈ సంప్రదాయం కొనసాగిందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన సేవలను ఆయన గుర్తుచేశారు. మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం అందులో కల్పించారని, ఇప్పటివరకు 106 రాజ్యాంగ సవరణ చట్టాలు అమలులోకి వచ్చాయని తెలిపారు.

‘సర్’ ప్రక్రియ చట్టబద్ధమైనదే

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- SIR) ప్రక్రియ చట్టబద్ధమైనదేనని వికాస్ రావు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ చేపట్టే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ దేశంలో ఎనిమిది సార్లు ఈ తరహా సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, నివాసం మారిన వారి వివరాలను సవరించడం, నకిలీ, ద్వంద్వ ఓట్లను తొలగించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ ప్రక్రియపై ఎవరికైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), ఓటరు నమోదు అధికారులను సంప్రదించి, నిర్దేశిత చట్టబద్ధమైన విధానంలో పరిష్కరించుకోవచ్చని సూచించారు.

విచ్ఛిన్న శక్తులతో ప్రజాస్వామ్యానికి ముప్పు

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే నిరసనలు శాంతియుతంగా, చట్టపరిధిలో జరగాలని వికాస్ రావు అన్నారు. ఎన్నికల్లో గెలవలేని కొన్ని శక్తులు నిరసనల పేరుతో అశాంతిని సృష్టించేందుకు, పోలీసు వ్యవస్థను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని ఆహ్వానించడం ప్రజాస్వామ్య వ్యవస్థలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ఈజిప్ట్, బంగ్లాదేశ్‌లలో చోటుచేసుకున్న పరిణామాల తరహా పరిస్థితులను భారత్‌లోనూ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన పేర్కొన్న విచ్ఛిన్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం, ప్రజలు రైల్వే పట్టాలపై ఉండే రెండు సమాంతర పట్టాల వంటివారని వికాస్ రావు అభివర్ణించారు. ఈ రెండు సమాంతరంగా సాగినప్పుడే ప్రజాస్వామ్య ప్రయాణం సురక్షితంగా ముందుకు సాగుతుందని అన్నారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. రాజకీయ పార్టీలు ఏర్పడుతుంటాయి, కనుమరుగవుతుంటాయి.. కానీ దేశం, ప్రజాస్వామ్యం శాశ్వతంగా నిలవాలని వికాస్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపి, ప్రముఖులు మోహన్ రెడ్డితో పాటు పలువురు స్థానిక మేధావులు, పౌరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: