Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రహదారి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రహదారి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  • పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధి రెండు కళ్లలాంటివి: ఆది శ్రీనివాస్
  • రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులు మంజూరు
  • 80 అడుగుల రహదారి విస్తరణ పనులు తుది దశకు

రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్
వేములవాడ పట్టణంలో చేపడుతున్న 80 అడుగుల రహదారి విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాజన్న ఆలయం, వేములవాడ పట్టణ అభివృద్ధి రెండూ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని పేర్కొన్నారు. వేములవాడను ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత:-

రహదారి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - Additional Image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు ఆలయ అభివృద్ధి కోసం సుమారు రూ.250 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని, ఆలయ అభివృద్ధి పనులు సుమారు 55 శాతం, అన్నదాన సత్రం నిర్మాణ పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయని వివరించారు. అదనంగా రూ.99.40 కోట్ల నిధులు మంజూరు కావడంతో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అన్నదాన సత్రం నిర్మాణానికి సంబంధించి రూ.35 కోట్లు, దేవాలయ అభివృద్ధి పనులకు రూ.51 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, శృంగేరి పీఠాధిపతి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు.

80 అడుగుల రహదారి కల సాకారం:-

వేములవాడ పట్టణ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 80 అడుగుల రహదారి విస్తరణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. రహదారి నిర్మాణానికి సుమారు రూ.6.5 కోట్లతో పాటు విద్యుత్ స్తంభాలు, లైటింగ్ ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రహదారి విస్తరణకు సంబంధించి రూ.47 కోట్లతో జీవో తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.రహదారి విస్తరణలో నిర్వాసితులు అందించిన సహకారం, చేసిన త్యాగాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. వారి సహకారం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రహదారి ఎక్కువకాలం మన్నికగా ఉండేలా పనులు చేపట్టాలని, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాట్లను కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.

మూడో బ్రిడ్జి పనుల వేగవంతానికి చర్యలు:-

ఇవి కూడా చదవండి

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మూడో బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా వేగవంతం చేస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. గతంలో శంకుస్థాపనలకే పరిమితమైన పనులను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి:-

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల పునరుద్ధరణ, విస్తరణ, జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు వివిధ ఆలయాల అభివృద్ధి కోసం సుమారు రూ.2,000 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. భక్తుల విశ్వాసాలను, సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.గతంలో 2015 జూన్ 18న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆది శ్రీనివాస్ విమర్శించారు.

వేములవాడను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం:-

రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ అవసరమైన నిధులను తీసుకొచ్చి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వేములవాడను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.రాజన్న ఆలయ అభివృద్ధి ఒకవైపు, వేములవాడ పట్టణ అభివృద్ధి మరోవైపు.. ఈ రెండింటినీ సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 80 అడుగుల రహదారి కల నెరవేరుతున్న నేపథ్యంలో, నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: